[google-translator]

WONDERFUL OLD COINS @ IN TTD MUSEUM

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో భద్రపరిచిన పలు నాణేలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో నాణేలను మొదటిసారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చారు. మొట్టమొదట చెల్లింపులకు ఉపయో గించిన వాటిని పంచ్‌మార్డ్క్‌(విద్ధాంత నాణేలు) నాణేలు అంటారు. అప్పటినుండి పలువురు చక్రవర్తులు, రాజులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి దానాలు, కానుకల రూపంలో నాణేలను సమర్పించారు. ఈ నాణేలు ఆనాటి భారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి.

 

                పల్లవులు, చోళులు, విజయనగర రాజులు సమర్పించిన నాణేలను అప్పట్లో ఆలయ కోశాధికారి స్వీకరించి రికార్డు చేసేవారు. బ్రిటీషువారి హయాంలో శ్రీవారి ఆలయంలో మొదటిసారిగా హుండీలు ఏర్పాటుచేశారు. అప్పటినుండి భక్తులు కూడా ఆయా కాలాల నాటి నాణేలను విరివిగా హుండీలో సమర్పించారు. ఇలా హుండీ ద్వారా సేకరించిన నాణేలను తితిదే కోశాగారంలో భద్రపరిచారు. వీటిలో పురాతన నాణేలను ప్రస్తుతం మ్యూజియంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

                ఇటీవల తితిదే కోశాగారం నుండి ఎస్వీ మ్యూజియం సేకరించిన నాణేల్లో క్రీ.శ 1వ శతాబ్దం కాలం నాటి నుండి ఉన్నాయి. క్రీ.శ 1వ శతాబ్దం నాటి రోమన్‌ నాణెం ప్రస్తుతం ఉన్న వాటిలో అతి పురాతనమైనది. నీరో చక్రవర్తి విడుదల చేసిన ఈ నాణెంలో ఒకవైపు రాజు-రాణి చిత్రం, మరోవైపు రాజు పేరు ఉన్నాయి.

 

                క్రీ.శ 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలం నాటి నాణేన్ని కర్ణాటకను పాలించిన పశ్చిమ గంగరాజులు విడుదల చేశారు. ఈ నాణేనికి ఒకవైపు పట్టపుటేనుగు, మరోవైపు పూలతీగ ఉన్నాయి.

 

                క్రీ.శ 11 -12వ శతాబ్దాల మధ్య కాలం నాటి హోయసాల నాణేన్ని విష్ణువర్ధన మహారాజ విడుదల చేశారు. దీనికి ఒకవైపు సింహం బొమ్మ, మరోవైపు ”శ్రీనొలంబ వాడి గొండ” అని కన్నడ లిపిలో ఉంది. విష్ణువర్ధన మహారాజు నొలంబను జయించినందుకు గుర్తుగా ఈ నాణేన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

 

                ప్రస్తుతం ఉన్న నాణేల్లో ఎక్కువ భాగం విజయనగరరాజుల కాలం నాటివే. వీటిలో మొదటి హరిహరరాయల నుండి వెంకటపతిరాయల వరకు విడుదల చేసినవి ఉన్నాయి. హరిహరరాయల నాణెంలో ఒకవైపు వీరుడి బొమ్మ, మరోవైపు ”శ్రీవీరహరి” అని ముద్రించి ఉంది. ఇంకా రెండవ హరిహరరాయలు, దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు విడుదల చేసిన పలు నాణేల్లో శివపార్వతులు ఒకవైపు, నాగరి లిపిలో రాజు పేరు మరోవైపు ఉన్నాయి. అలాగే లక్ష్మీనారాయణులు ఒకవైపు, నాగరి లిపిలో రాజు పేరు మరోవైపు గల నాణేలున్నాయి. కొన్ని నాణేలపై ఒకవైపు వెన్నముద్ద పట్టుకున్న కృష్ణుడు, మరోవైపు నాగరి లిపిలో ”శ్రీప్రతాపకృష్ణరాయ” అని రాసి ఉంది. అచ్యుతరాయల నాణెంలో ఒకవైపు ” ఏనుగును నోట కరుచుకున్న రెండు తలల గండబేరుండ పక్షి”, మరోవైపు నాగరి లిపిలో అచ్యుతరాయల పేరు ఉన్నాయి.

 

                విజయనగరరాజుల కాలంలోనే అరవీడు వంశస్తుడైన వెంకటపతిరాయల నాణెంలో ముందువైపు శ్రీ వేంకటేశ్వరస్వామి బొమ్మ, వెనకవైపు నాగరి లిపిలో ”శ్రీవేంకటేశాయనమః” అని రాసి ఉంది. విజయనగర రాజుల కాలం నాటి నాణేలను ‘వరహాలు’ అని, చిన్న నాణేలను ‘పణం’ అని పిలుస్తారు.

 

                ముస్లిం రాజులు విడుదల చేసి మొఘల్‌ నాణెం, అక్బరు, ఔరంగజేబు, షా ఆలం రాజుల నాణేలుకూడా ఉన్నాయి. వీటిలో ఒకవైపు ‘ఖురాన్‌ కలిమ’, మరోవైపు రాజుపేరు ఉన్నాయి.

 

                మైసూరు రాజ్యాన్ని పాలించిన ఆనాటి వడయార్‌ రాజుల బంగారు నాణేలు, శ్రీరంగ పట్నంను పాలించిన హైదరాలి, టిప్పుసుల్తాన్‌ నాణేలు అప్పట్లో వారికున్న ముద్రణ కేంద్రాలను(మింట్‌) తెలియజేస్తున్నాయి.

 

                బ్రిటీషు ఇండియా, ఈస్ట్‌ ఇండియా కంపెనీలు విడుదల చేసిన నాణేల్లో స్టార్‌ పగోడాలు, పగోడాలు, మోహర్‌లు ఉన్నాయి. త్రిస్వామి నాణెంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమహావిష్ణువు బొమ్మలు, 2పగోడా నాణెంలో ఒకవైపు వేంకటేశ్వరస్వామి బొమ్మ, మరోవైపు ఆలయ గోపురం ఉన్నాయి. బ్రిటీషువారు అప్పట్లో హిందువుల మెప్పు పొందేందుకు మన సంప్రదాయరీతులను గౌరవిస్తున్నట్టు నమ్మించేందుకు నాణేలపై హిందూ సంప్రదాయంలో బొమ్మలను ముద్రించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొఘల్‌ రాజులను ఒప్పించి మోహర్లు, హిందూ రాజులను ఒప్పించి పగోడాలు ముద్రించినట్టు ఆధారాలున్నాయి.

 

                విక్టోరియా మహారాణి, కింగ్‌ జార్జి నాణేలతో పాటు అప్పట్లో చెలామణిలో లేని రామటంకా, పద్మటంకా నాణేలు కూడా మ్యూజియంలో కొలువుదీరాయి. రామటంకా, పద్మటంకా నాణేలను అప్పట్లో పూజ కోసం వినియోగించేవారు.

 

                ఈ నాణేలను పరిశీలిస్తే అప్పటి ముద్రణ కేంద్రాలను కూడా తెలుసుకోవచ్చు. విజయనగర రాజుల కాలంలో తిరుపతి, గుత్తి, గండికోట, గుర్రంకొండ, ఆధోనిలో ముద్రణకేంద్రాలుండేవి. హైదరాలి, టిప్పుసుల్తాను కాలంలో శ్రీరంగపట్నం, పట్నం, గుర్రంకొండ, కోలారులో ముద్రణ కేంద్రాలు నడుస్తుండేవి. బ్రిటీషువారి కాలంలో హైదరాబాద్‌, మచిలీపట్నం, చెన్నైలో ముద్రణ కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తోంది.

 

                బంగారు నాణేలతోపాటు బహమనీ సుల్తానుల వెండినాణేలు, చోళులు, పలు సంస్థానాధీశులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ, నిజాం రాజులు విడుదల చేసిన రాగినాణేలు యాత్రిక భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

 

                పురాతన కాలం నాటి నుండి ఎంతోమంది రాజులు స్వామివారి ధూపదీప నైవేద్యాల కోసం, కైంకర్యాల కోసం స్వామివారికి నాణేలను కానుకలుగా సమర్పించారు. బంగారు నాణేలను అప్పట్లో కరిగించి ఆలయ విమానగోపురానికి బంగారు తాపడం చేయించినట్టు శ్రీకృష్ణదేవరాయల 1518వ సంవత్సర కాలం నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. కాగా తితిదే కోశాగారంలో ఉన్న ఎన్నో బంగారు నాణేలను వ్యవసాయం కోసం చెరువులు, కాలువలు తవ్వించేందుకు, రోడ్లు వేయించేందుకు ఖర్చు పెట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

 

%d bloggers like this: