[google-translator]

TIRUMALA TEMPLE INSIDE DAILY SEVAS….. Full Details

సుప్రభాతం :

 

                తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును మేల్కొల్పడాన్నే సుప్రభాతం అంటారు. ప్రతిరోజూ తెల్లవారుజామున బంగారు వాకిలి ముందు ఆచార్యపురుషులు ”కౌసల్యా సుప్రజారామ…” అంటూ సుప్రభాత శ్లోకాలను పఠిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులు ఒకరు ”మేలుకో శృంగార రాయ…..” అంటూ మేల్కొల్పులు పాడతారు. ఈ సమయంలో ప్రతివాది భయంకర అణ్ణన్‌ రచించిన 70 శ్లోకాలను వేదపండితులు ఆలపిస్తారు.

 

తోమాలసేవ, కొలువు :

 

                తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను, ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్నే తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని ”తోళ్‌మాలై” అంటారు. అదే ‘తోమాల’గా మారిందంటారు. తోళ్‌ అంటే భుజమని అర్థం.

 

                తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి కొలువు జరుగుతుంది. ఆ సమయంలో ఆనాటి తిథి నక్షత్రాది వివరాలతో పంచాంగ శ్రవణం జరిగిన తరువాత ముందురోజు హుండీ ఆదాయ వ్యయాలు, అన్నదాతల పేర్లు అన్నింటినీ స్వామివారికి నివేదిస్తారు.

 

అర్చన :

 

                జియ్యంగారులు అందించిన తులసిని స్వీకరించి అర్చకులు శ్రీవేంకటేశ్వర సహస్రనామావళితో శ్రీవారి పాదాలను అర్చన చేస్తారు. ఆ తరువాత శ్రీవారి పాదాల మీది తులసిని స్వీకరించి స్వామివారి వక్షఃస్థలం మీది శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మీ చతుర్వింశతి(24) నామాలతో అర్చిస్తారు.

 

నివేదన, శాత్తుమొర :

 

                అర్చన తరువాత గర్భాలయంలో శ్రీస్వామివారికి, ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డూలు, వడలు, దధ్యోదనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట, మధ్యాహ్నం నివేదనను రెండవ గంట, రాత్రి నివేదనను మూడవ గంట లేదా రాత్రి గంట అంటారు.

 

                నివేదన తరువాత వైష్ణవాచార్య పురుషులు స్వామివారి సన్నిధిలో దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. దీన్నే శాత్తుమొర అంటారు. అనంతరం శ్రీవైష్ణవాచార్యులందరూ రామానుజులకు నివేదన అయిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు.                               

 

సహస్రదీపాలంకారసేవ :

 

                సహస్రదీపాలంకారసేను ఊంజల్‌ సేవ అని కూడా అంటారు. శ్రీదేవి, భూదేవితో కూడిన మలయప్పస్వామి ఊరేగింపుగా వచ్చి సహస్రదీపాలు వెలిగించిన మండపంలో ఊంజల సేవలో పాల్గొంటారు.

 

ఏకాంతసేవ :

 

                ఏకాంతసేవను పాన్పుసేవ, పవళింపు సేవ అని కూడా అంటారు. వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు. తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట లేదా లాలిపాట గానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో తరిగొండవారి తరఫున హారతి పళ్లెం వస్తుంది.

 

విశేషపూజ :

 

                మొదటగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. శోభాయమానంగా సాగిన ఈ విశేషపూజను తిలకించి భక్తులు ఆనందపరవశులయ్యారు. గోవిందనామస్మరణతో భక్తిభావాన్ని చాటారు.

 

అష్టదళ పాదపద్మారాధన సేవ :

 

                108 బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదళ పాదపద్మారాధన. ఇందులో భాగంగా బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు.

 

సహస్రకలశాభిషేకం :

 

                భోగశ్రీనివాసమూర్తితోపాటు, విష్వక్సేనుడు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు.

 

నేత్రదర్శనం  విశిష్టత : 

 

                ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.

 

తిరుప్పావడ సేవ ప్రాధాన్యత :

 

                ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి రెండవ అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవని, అన్నకూటోత్సవమని అంటారు. శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపళ్లెంలో పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరిస్తారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పిస్తారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠిస్తారు.

 

                అంతకుముందు శ్రీవారి మూలవిరాట్‌ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేస్తారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. ”శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి. అదేవిధంగా స్వామివారు చూపు తీక్షణత తగ్గుతుంది. పులిహోర ”పావడ(పరదా)”లాగ వ్యవహరించి స్వామివారి శక్తివంతమైన చూపు భక్తులపై పడకుండా కాపాడుతుంది” అని భక్తుల నమ్మకం.

 

అభిషేకం :

 

                తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. భగవద్రామానుజుల వారు శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేట్టు ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలమ్మీది మహాలక్ష్మికి కూడా అభిషేకం నిర్వహిస్తారు.

 

                బ్రహ్మాది దేవతల కోరిక మేరకు కలియుగంలో వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. అభిషేకం తరువాత శ్రీస్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలు మంగకు కూడా అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం భక్తులందరి మీద తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగుస్తుంది.

 

కల్యాణోత్సవం :

 

                 హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే శ్రీనివాస కల్యాణాల ద్వారా కల్పిస్తోంది. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ కల్యాణాలు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి.

 

                వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగుస్తుంది.

 

పుష్పయాగం  :

 

                శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మొదట పవిత్రమైన తులసీదళాల అర్చనతో పుష్పయాగం ప్రారంభమవుతుంది. ఆ తరువాత మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పనీరాజనం సమర్పిస్తారు.

 

ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠిస్తారు. చివరగా నక్షత్ర హారతి ఇస్తారు. పుష్పయాగాన్ని 15వ శతాబ్దంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని ప్రార్థిస్తూ స్వామివారి ద్వారా భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారని పురాణ ప్రశస్తి.