[google-translator]

SREEVARI METTU – Tirumala Hills, Easy way to reach the God with less effort

శ్రీవారిమెట్టు – తిరుమల

 

శేషాచల క్షేత్రానికి ఉన్నట్టి మహిమ ఇతర క్షేత్రాలకు దేనికీ లేనే లేదు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని వంటి మహిమాన్వితమైన దేవుడు, దయాంతరంగుడైన దేవుడు ఇంకెక్కడా కానరాడు!

 

 శ్రీ వైకుంఠాన్నయినా విడిచి ఉంటానుగాని, నా భక్తులను ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న సంకల్పంతో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చి ‘శ్రీ వేంకటేశ్వరుడు’ అన్న పేరుతో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా స్వయంవ్యక్తరూపంతో తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నాడు.

 

                ‘కలౌ వేంకటనాయకః’ అన్నట్లు ‘ఈ కలియుగంలో అందరికీ ఏకైక దిక్కును నేనే’నంటూ-తమ కోసం వెలసివున్న దేవుణ్ణి, కేవలం దర్శన మాత్రం చేతనే కష్టాలకడలినుండి ఉద్ధరించే దేవుణ్ణి దర్శించడంకోసమే ఆనాటి నుండి భక్తులు తిరుమలయాత్రకు వస్తూనే ఉన్నారు.

 

                ప్రాచీనకాలంలో తిరుపతియాత్రలో ఇంటినుండి బయలుదేరి దిగువ తిరుపతి చేరుకోవడం ఒక ఎత్తైతే, దిగువ తిరుపతి నుంచి ఎగువ తిరుపతికి (తిరుమలకు) చేరుకోవడం మరో ఎత్తు! అప్పట్లో తిరుపతి నుంచి తిరుమల కొండకు నడచి మాత్రమే వెళ్ళాలి. కొండపైకి వెళ్లడానికి ప్రాచీన కాలంలో మూడు లేదా నాలుగు మార్గాలున్నాయని చెప్పబడినా, ప్రధానంగా సోపానమార్గాలు (మెట్లదారులు) మాత్రం రెండే ఉన్నాయి.

 

1) అలిపిరి నుండి మెట్లదారి :

 

                తిరుపతి అలిపిరిలో పాదాలమండపం నుండి ఈ నడకదారి ప్రారంభమౌతుంది. శ్రీవారి పాదాలమండపంలో శ్రీ స్వామివారి అద్భుతమైన పెద్ద శిలాపాదాలు మరియు శ్రీనివాసుడు విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ‘తిరుమల నంబి’ అనే భక్తుని కోసం, శ్రీ స్వామివారు తన పాదాలను ప్రత్యక్షంగా దర్శింపజేశాడు. అవే అలిపిరిలోని నేటి శిలాపాదాలు. అక్కడి నుంచి మొదలైన ఈ మార్గంలో తలయేరు గుండు, చిన ఎక్కుడు, పెద ఎక్కుడు, గాలిగోపురం, ముగ్గుబావి, త్రోవనరసింహుడు, అవ్వాచరికోన, మోకాళ్లమిట్ట, త్రోవభాష్యకార్లు, సీతమ్మసారెపెట్టెలు, రావిమాను, బేడి ఆంజనేయస్వామి, శ్రీవారిసన్నిధి వరకు సాగే అలిపిరి మెట్లదారిలో అక్కడ క్కడా శ్రీ స్వామివారి ‘శిలాపాదాలు’ భక్తులకు దర్శనమిస్తూ భక్తిని పెంపొంది స్తుంటాయి.

 

                సాలగ్రామమయమైన తిరుమలకొండనే సాక్షాత్తు శ్రీనివాస భగ వానునిగా దర్శించిన ఆళ్వారులు, భగవద్రామానుజులవారు అలిపిరి నుంచే ఆ దివ్యక్షేత్రాన్ని భక్తితో సేవించారు. నమస్కరించారు. కొండను మాత్రం ఎక్కలేదు. కాని అప్పట్లో అస్తవ్యస్తంగా సాగుతున్న శ్రీవారి అర్చనావిధానాన్ని క్రమబద్ధీకరించడం కోసం భక్తుల కోరికమేరకు భగవద్రామానుజులవారు కేవలం మూడుమారులు ఆహారపానీయాలు లేకుండా మోకాళ్ళపై తిరుమల కొండకు నడచి వెళ్లారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఎందరో, ఎందరెం దరో మహాభక్తులు, యాత్రికులు అలిపిరి మెట్లదారిలో నడచి వెళుతూ తిరు మల యాత్రను సంపూర్ణంగా ఫలప్రదం చేసుకొన్నారు.

 

                ఈ అలిపిరి మార్గాన్ని అభివృద్ధి చేసి, యాత్రికుల సౌకర్యం కోసం తి.తి.దేవస్థానం నీటి సౌకర్యం, విద్యుత్తు, వైద్యం, షెల్టర్లు, ఆహారం, పారిశుద్ధ్యం, భద్రత వంటి ఎన్నెన్నో సౌకర్యాలు కల్పిస్తున్నది.

 

2) శ్రీవారిమెట్టు :

 

                శ్రీనివాస మంగాపురం మొదలుకొని తిరుమల వరకు గల సోపాన మార్గాన్ని ‘శ్రీపతిమెట్టు’ లేదా ‘శ్రీవారిమెట్టు’ అంటారు. ఆధ్యాత్మిక పురోగతికి తొలిమెట్టు ఈ శ్రీవారిమెట్టు. చంద్రగిరివైపు ఉన్న సోపానమార్గం కనుక ‘చంద్రగిరి సోపాన మార్గం’ అని కూడ పిలువబడుతున్నది. కాని ప్రస్తుతం విస్తృతంగా ఉన్న వ్యవహార నామం ”శ్రీవారిమెట్టు”.

 

                భువిపై శ్రీ ఆదివరాహక్షేత్రం ఆవిర్భవించిన తర్వాత, శ్రీ వైకుంఠం నుంచి శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మిని వెదుకుతూ, ఈ క్షేత్ర శిఖరంపై తొలిగా కాలూనినాడు. అదే నేటి నారాయణగిరి పర్వతం! సాక్షాత్తు శ్రీమన్నారాయణు డైన శ్రీనివాసుడు ‘పాదాలు’ మోపిన గిరి కనుక ‘నారాయణగిరి’ అని పిలువ బడింది. అందుకు గుర్తుగా ఆ నారాయణగిరి శిఖరాన శ్రీవారి దివ్యపాదాలను (శిలాపాదపద్మాలను) భక్తులు దర్శించవచ్చు. ‘నారాయణగిరి’ ఆకాశపుటంచు లను తాకుతున్న పర్వతశిఖరం కాగా, దాన్ని ఆనుకొని వేంకటాచలక్షేత్రం నుండి భువికి దిగివచ్చే లోతైన మార్గమే ‘శ్రీవారిమెట్టు’ నడకమార్గం!

 

                వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన శ్రీనివాసుడు నడయాడిన దివ్య క్షేత్రం వేంకటాచలం కాగా, అక్కడినుంచి పలుమార్లు కొండదిగివచ్చి నారా యణోద్యానవనానికి వేటకు వెళ్లి పద్మావతిని మోహించి తిరిగివచ్చిన మార్గం కూడా ఈ శ్రీవారిమెట్టు మార్గమే!

 

                ఆ తర్వాత శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహమాడి అగస్త్యమహర్షి కోరికమేరకు ఆరునెలలపాటు ఇక్కడి ఆశ్రమంలో విడిది చేశాడు. ఆ తర్వాత పద్మావతీ శ్రీనివాసులు ఇరువురు కలిసి శ్రీ వరాహక్షేత్రానికి నడచి వెళ్లిన మార్గం కూడ శ్రీవారిమెట్టు మార్గమే! అందుకు గుర్తుగా శ్రీనివాస మంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరునిగా వెలసిన తనను దర్శించిన వారికి కల్యాణ పరంపరలు కలుగుతాయని, వివాహం కావలసిన వారికి వివాహం కాగలదని కూడా వరమిచ్చాడు శ్రీనివాసుడు.

 

                సాక్షాత్తు పద్మావతీ శ్రీనివాసులు నడయాడిన మహిమాన్వితమైన శ్రీవారిమెట్టు మార్గమే, ఆ తర్వాతికాలంలో ఎందరో రాజులకు, యాత్రికులకు వేంకటాచలయాత్రకు ప్రధాన రాజమార్గమైంది.

 

                 నారాయణవర ప్రభువులు ఆకాశరాజు, తొండమానుడు మొదలు  విజయనగర ప్రభువుల వరకు ‘శ్రీవారిమెట్టు’ మార్గాన్ని తమ యాత్రా మార్గంగా చేసుకున్నారు. విజయనగర రాజులు చంద్రగిరి కోటలో విడిది చేసిన సమయంలో శ్రీవారి నైవేద్యఘంటానాదాన్ని అంచలంచెలుగా ఉన్న ఘంటామండపాలద్వారా విన్న తర్వాతనే భోజనం చేసేవారట!

 

                శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు వారి రాణులు గుర్రాలపైనా, మేనాలపైనా ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకొని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

 

                సువర్ణముఖీనది, కల్యాణీనదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న చంద్రగిరి, శ్రీనివాసమంగాపురం, కాళూరు, పేరూరు, పెరుమాళ్లపల్లె, చెర్లోపల్లె మున్నగు గ్రామాల పొలాలు తిరుమల శ్రీవారి ఇనాము భూములుగా ఉండేవి. ఆ పొలాల్లో రైతులు పండించిన వరిధాన్యం, పప్పుదినుసులు, శ్రీవారి వంటలకు, దీపాలకు ఉపయోగించే ఆవునెయ్యి, ఆవుపాలు, పెరుగు మున్నగు పాడి ద్రవ్యాలన్నీ శ్రీవారిమెట్టు మార్గం నుండే తిరుమల శ్రీవారి ఆలయానికి చేరవేసేవారని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.

 

                తిరుమల కొండపై ఆలయ మండప నిర్మాణాలకు అవసరమైన గండశిలలు కూడా ఈ శ్రీవారిమెట్టు మార్గం ద్వారా మాత్రమే కొండపైకి ఏనుగులద్వారా చేరవేసి ఉంటారని భావించడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

 

                ఎందరో మహనీయులకు నిలయమై ‘సిద్ధకూటం’ అని పిలువబడిన శ్రీనివాస మంగాపురంలో, 24 మంది మహాజనం (వేదపండితులు) ఉండే వారనీ, నెలకు ఇద్దరు వంతున సంవత్సరం పొడవునా ‘శ్రీవారిమెట్టు’ మార్గం ద్వారా తిరుమలకు నడచివెళ్ళి శ్రీవారి ఆలయంలో వేదపారాయణం చేసేవారని క్రీ.శ.1433 నాటి శాసనం స్పష్టం చేస్తున్నది.

 

                తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చనల్లో, సేవల్లో, ఉత్సవాల్లో భక్తులుగా, ఆలయకవులుగా సముచిత స్థానాన్ని సంపాదించుకొని సత్కరింప బడిన తాళ్లపాక కవులు, ముఖ్యంగా అన్నమయ్య మనుమడు చినతిరుమలా చార్యులు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరాలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు. క్రీ.శ. 1540 ప్రాంతంలో తాళ్లపాకవారికి అచ్యుతరాయల చేత శ్రీనివాసమంగాపుర గ్రామం సర్వమాన్యంగా ఇవ్వబడింది. అప్పట్లో అటు తిరుమల శ్రీవారిఆలయాన్ని, ఇటు శ్రీనివాసమంగాపురంలోని ఆలయాన్ని పర్యవేక్షించిన తాళ్లపాకవారికి   ఈ శ్రీవారిమెట్టు మార్గమే శరణ్యమయ్యింది. అప్పట్లో శ్రీవారిమెట్టు గుండా తిరుమలకు వెళ్లే భక్తులందరూ శ్రీనివాసమంగా పురంలోని కల్యాణవేంకటేశ్వరుని తప్పక దర్శించేవారు.

 

                శ్రీనివాసమంగాపురం ఆలయానికి ఉత్తరం దిక్కున 6 కి.మీ. దూరంలో ఉన్న శ్రీవారిమెట్టుకు వెళ్ళేదారిలో యాత్రికులకు, భక్తులకు విశ్రాంతి సత్రాలు, దేశాంతర మండపాలు, దిగుడు బావులు, వంటశాలలు నిర్మింపబడినాయి. అప్పటి యాత్రికుల సేవలో తరించిన ఆనాటి శిథిలమండపాలను,  దిగుడు బావులను నేటికీ చూడవచ్చు. అక్కడికి దగ్గర్లో భక్తాంజ నేయస్వామివారి ఆలయం ఉంది. ఆ స్వామివారిని పూజించిన తర్వాతే భక్తులు కొండను ఎక్కేవారు. ఈ శ్రీవారిమెట్టు దారిలో అక్కడ కూడా శ్రీవారి శిలా పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి.

 

                శ్రీ పద్మావతీ శ్రీనివాసులు నడయాడిన దివ్యమార్గంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, కాలాంతరంలో సువర్ణముఖీ కల్యాణీ నదుల ఉధృత మైన వరదల తాకిడికి లోనయ్యింది. ఈ వరదల వల్ల ఇతర గ్రామాలతో పాటు శ్రీనివాసమంగాపుర గ్రామంలోని కల్యాణ వేంకటేశ్వరాలయం కూడా శిథిలమైంది. అప్పటి నుంచి రాకపోకలు సన్నగిల్లి శ్రీవారిమెట్టు మార్గం యాత్రికుల నిరాదరణకు లోనయ్యింది. దీనికి తోడు తిరుపతి నుంచి తిరు మలకు ఏర్పడిన బస్సు సౌకర్యంతో ప్రయాణం సుఖవంతం అవడం వల్ల చాలామటుకు యాత్రికుల రాకపోకలు శ్రీవారిమెట్టు మార్గంలో దాదాపు నిలిచిపోయాయని చెప్పవచ్చు. అడపాదడపా చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం గ్రామాల ప్రజలు ఈ శ్రీవారిమెట్టు ద్వారా కొండకు వెళ్లి తిరుమల భక్తులకు అవసరమయ్యే కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి వగైరా వాటిని అమ్ము కొనేవారు.

 

                1843 నుంచి 1933 వరకు సాగిన మహంతుల పరిపాలన కాలంలో కూడ ముఖ్యంగా మహంతు ప్రయాగదాసు తన 33 ఏండ్ల దేవస్థానం నిర్వహణ కాలంలో అలిపిరి మార్గాన్ని అభివృద్ధి చేశారు. కాని ఎందుకో శ్రీవారిమెట్టు మార్గాన్ని విస్మరించారు. బహుశా యాత్రికులను పూర్తిగా అలిపిరి మార్గంలో తిరుమలకు రప్పించడం ద్వారా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి ఆలయం, కపిలతీర్థం మున్నగు ఆలయాలన్నీ భక్తుల రద్దీతో సందడిగా ఉంటూ అభివృద్ధి చెంద గలవన్న అభిప్రాయంకూడా అందుకు ప్రధాన కారణం కావచ్చు!

 

                సాక్షాత్తు తిరుమలేశుడు తాను నడయాడిన ఈ దివ్యమార్గాన్ని పున రుద్ధరింపజేయాలని సంకల్పించి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వ హణాధికారులైన డా|| కె.వి.రమణాచార్యులవారికి చక్కని ప్రేరణనిచ్చారు కాబోలు!

 

                వారి పట్టుదలతో సడలని దీక్షతో ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు వారి ఆధ్వ ర్యంలో తిరుమల శ్రీవారిమెట్టుమార్గం పునరుద్ధరింపబడి, నిర్మింపబడింది. తొలిమెట్టు ప్రారంభాన సుమారు 38 లక్షల రూపాయల ఖర్చుతో శ్రీవారి పాదాలమండపం ఆలయం ప్రతిష్ఠింపబడింది. అక్కడి నుంచి మొదలై తిరుమల వరకు సుమారు 2.5 కిలోమీటర్ల పొడవున సాగిన కాలినడక దారిలో సుమారు 6 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రానైటు రాళ్లతో 2388 మెట్లు, ఎండ తగలకుండా, వానకు తడవకుండా ఆ మెట్లపై చక్కని ఆచ్ఛాదన, దారి వెంబడి మంచినీరు, విద్యుత్తు, పారిశుధ్యం, భద్రతవంటి విస్తృత సౌకర్యాలతో శ్రీవారిమెట్టు మార్గం పునర్నిర్మింపబడింది. తిరుపతి ‘శ్రీనివాసం’ నుండి శ్రీవారిమెట్టు వరకు ఉచిత బస్సుసౌకర్యం కూడ ఏర్పాటు చేయబడింది.

 

                అటు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లేమార్గంలోను, శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలోను, ‘నారాయణగిరి’ పర్వత శిఖరాన ఇలా అడుగడుగునా ఎక్కడ చూచినా శ్రీనివాసుడు తన పాదాలను దర్శింప జేస్తూ తిరుమలకు వెళ్ళే భక్తుల యాత్రను పూర్తిగా ఫలవంతం చేస్తున్నాడు.

 

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ – అన్నీ వదలిపెట్టి నన్ను శరణువేడండి అని శ్రీకృష్ణభగవానుడు అన్నట్లుగా, ఈ వేంకటాద్రి కృష్ణుడు తన అవతార లక్ష్యమే అది అన్నట్లుగా తన పాదాలను శరణువేడుమని చెబుతూ, భక్తులను రక్షిస్తున్నాడు.

 

                ‘సంసార సాగర సముత్తరణైక సేతో’ అన్నట్లుగా కుడి హస్తంతో తన పాదాలను చూపుతూ వీటిని శరణువేడితే చాలు- మీ సంసార సముద్రాన్ని మెకాళ్లబంటి మాత్రం చేసి సులభంగా దాటించడమేగాక, మిమ్మల్ని అక్కున చేర్చుకుంటానని ఎడమచేత్తో సందేశమిస్తున్నట్లుగా సొంపైన భంగిమలో దర్శన మిస్తూ వయ్యారంగా నిలిచిన శ్రీ స్వామివారి తీరు, రీతి కడు రమణీయం! ఆ భంగిమను ఒక అజ్ఞాత మహాకవి ఇలా ప్రశ్నిస్తాడు.

 

కుడిహస్తం బిటు చూపు చందమిది, వైకుంఠబనే యందమో!

 

జడధివ్రాత పరీత భూ భవన రక్షా దక్షిణంబైన నీ

 

యడుగుల్‌ చూడుమనేవొ! కాక యొక యొయ్యారంబొ? సందేహమై

 

యడిగే నానతి యిమ్ము, వేంకట నగాధ్యక్షా! జగద్రక్షకా!!

 

                ఆ కవిగారి సందేహంలోనే సమాధానం దొరుకుతూ శ్రీవారి పాద దర్శన ప్రాశస్త్యం స్పష్టమౌతున్నది. అందువల్లే తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయంలో ‘శ్రీవారి పాద దర్శనం పాప విమోచనం’ అన్న నానుడి రూఢిగా నిలిచి ఉంది!

 

                పచ్చని చెట్లతో, పక్షుల కిల కిలా రావాలతో ప్రతిధ్వనిస్తూ వింత వింత సోయగాలతో మైమరపించే ప్రకృతి రమణీయకత ఉట్టిపడే దివ్యమైన శ్రీవారిమెట్టు మార్గంలో, జగత్కల్యాణ మూర్తులు అయిన శ్రీ పద్మావతీ శ్రీనివాసులు ఇరువురూ చెట్టాపట్టాలేసుకొని నడచిన ఈ శ్రీవారిమెట్టు మార్గంలో మనమందరం అడుగులో అడుగు వేసుకొంటూ ఆ అడుగడుగు దండాలవాణ్ణి స్మరిస్తూ, ఆ వేంకటాచల శిఖరాగ్రాన ఆ దివ్యదంపతులిద్దరూ ఒక్కటై, ఏకమై, మమేకమై అనంతమైన ఆనందమయమైన ఒకే తత్త్వంగా సహస్రారచక్రం వలె భాసిస్తూ ఉన్న ఆనందనిలయం అనే బంగారు మేడలోని ‘శ్రీనివాస పరం బ్రహ్మ’ను దర్శిద్దాం! చూసితరిద్దాం!!

 

భవాబ్దితారం కటివర్తి హస్తం

 

స్వర్ణాంబరం రత్నకిరీటకుండలమ్‌,

 

ఆలంబి సూత్రోత్తమ మాల్యభూషితం

 

నమామ్యహం వేంకట శైలనాయకమ్‌ .