[google-translator]

Spl. Article on TTD’s S.V. VEDAPATASHALA – Dharmagiri,Tirumala

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు

 

                తిరుమల తిరుపతి దేవస్థానం విధుల్లో వేదపరిరక్షణ ఒకటి. వేదాలను పరిరక్షించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు, సమాజహితం కోసం వేదవిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని ధర్మగిరిలో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో విద్యార్థులకు వేద విద్యను అందిస్తోంది.

 

                ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్య ప్రబంధం కోర్సులను ఇప్పటివరకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత కోర్సులైన శాస్త్రాలు, దర్శనాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రం, పురాణేతిహాసాలతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేస్తూ నైపున్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు వేస్తోంది.

 

సుదీర్ఘ చరిత్ర సొంతం :

 

                శ్రీవేంకటేశ్వర వేదపాఠశాలను 1884వ సంవత్సరంలో తితిదే ఏర్పాటుచేసింది. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పాఠశాలగా ఇది గుర్తింపు పొందింది. 1992వ సంవత్సరంలో తిరుమలలోని ధర్మగిరిలో వేద పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 7 వేదశాఖలు, 5 ఆగమ శాఖలు, 4 స్మార్థ శాఖలు, ఒక దివ్యప్రబంధ శాఖ కలిపి మొత్తం 17 శాఖలున్నాయి. మొత్తం 654 మంది విద్యార్థులు, 60 మంది అధ్యాపకులు ఉన్నారు.

 

12 సంవత్సరాల కాలపరిమితి గల వేదశాఖల్లో ప్రవేశానికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఐదో తరగతి ఉత్తీర్ణులై, ఉపనయనం పూర్తయిన వారు, 8 ఏళ్ల కాలపరిమితి గల ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధ కోరుల్లో ప్రవేశానికి 12 నుంచి 14 ఏళ్లలోపు వయసుండి, ఏడో తరగతి ఉత్తీర్ణులైన, ఉపనయనం పూర్తయిన విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందిన విద్యార్థులకు భోజనం, వసతి, వస్త్రాలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని శాఖల విద్యార్థులకు సంస్కృతం బోధిస్తారు. వేద విద్యార్థులకు కోర్సు ప్రారంభంలో రూ.3 లక్షలు, ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధం విద్యార్థులకు రూ.ఒక లక్ష డిపాజిట్‌ చేస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేస్తారు.

 

ప్రాక్టికల్‌ శిక్షణ :

 

                వేద పాఠశాలలో విద్యార్థుల దృష్టి అంతా అభ్యసనపైనే ఉండేలా రోజువారీ సమయాన్ని పెంచారు. నేర్చుకున్న పాఠ్యాంశాలను సాధన చేసేందుకు ఉదయం, మధ్యాహ్నం కలిపి నాలుగు గంటలు సమయం పెంచారు. అలాగే శారీరక, మానసిక వికాసం కోసం ప్రతిరోజూ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించారు.

ఇక వీలైనప్పుడల్లా తిరుమల శ్రీవారికి జరిగే సేవలు, ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వీటితోపాటు ప్రతినెలా హోమాలు, కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు తదితర క్రతువులు, ఉత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

 

                హాస్టల్లో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు వయసుల వారీగా వేరువేరుగా గదులు కేటాయించారు. విద్యార్థుల సమస్యలు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా పాఠశాలలో మూడు చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటుచేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు రాత్రివేళ కూడా హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.

 

బ్రహ్మోత్సవాల్లో అవకాశం :

 

                తిరుమల శ్రీవారు, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వేద విద్యార్థులకు  తితిదే అవకాశం కల్పిస్తోంది. వైదిక హారంలా విద్యార్థులు వాహనం చుట్టూ విధులు నిర్వహిస్తారు. అంతేగాక వాహనం వెనుక వేదపారాయణం చేస్తారు. తితిదే స్థానిక ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లోనూ వేద విద్యార్థులకు అప్పుడప్పుడు అవకాశం కల్పిస్తారు.

 

మెండుగా ఉపాధి అవకాశాలు :

                తితిదేలో పేరెన్నికగన్న అర్చకులందరూ ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. వీరిలో శ్రీ సుందరవరద భట్టాచార్య, ఎన్‌.ఎ.కె.శ్రీనివాసాచార్య, పెద్దజీయర్‌స్వామి తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ చదువుకున్న వంద మంది విద్యార్థులు తితిదేలో అర్చకులుగా ఉద్యోగాలు సాధించారు.

ఈ విద్యాసంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన ఐదుగురు వేద విద్యార్థులకు(సలక్షణ ఘనాపాఠీలు) తితిదే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అర్చకులుగా ఉద్యోగాలు కల్పించింది. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాల్లోనూ ఉపాధి అవకాశాలున్నాయి. 150 మంది విద్యార్థులు అమెరికా, లండన్‌, కెన్యా, నైజీరియా, మారిషస్‌, ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లోని ఆలయాల్లో  అర్చకులుగా ఉపాధి పొందారు.

 

 

%d bloggers like this: