[google-translator]

History Of ALWARS

శ్రీవారి భక్తితత్వాన్ని చాటిన ఆళ్వార్లు

 

భగవంతుని పట్ల కనబరిచే పవిత్రమైన ప్రేమభావనే భక్తి. దేవుని స్వరూప, రూప, గుణవైభవాన్ని అనుభవించడం కూడా భక్తే. ఇలాంటి భగవత్‌ భక్తిసాగరంలో మునకలు వేస్తూ, లోతులు చూసిన శ్రీవైష్ణవ భక్తశిఖామణులు ఆళ్వారులు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూలపురుషులు.

 

మొత్తం పన్నెండు మంది ద్రావిడ దేశంలో అవతరించి శ్రీమన్నారాయణుడి లీలావిశేషాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాలుగు వేల పాశురాలలో కీర్తించారు. పాశురమంటే పద్యమని భావం. ఈ పాశురాలలో తిరుమల, శ్రీరంగం, కంచి తదితర శ్రీవైష్ణవ దివ్యదేశాల్లో వెలసిన భగవంతుని అర్చామూర్తులను పలువిధాలుగా ప్రస్తుతించారు. వేదాంతసారాలైన ఆళ్వార్ల రచనలు నాలాయిర దివ్యప్రబంధమనే పేరుతో ప్రఖ్యాతిగాంచాయి.

 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిపై 10 మంది ఆళ్వార్లు పాశురాలు రచించి కీర్తించారు. వీరిలో 1.పొయ్‌కై ఆళ్వార్‌, 2.పూదత్తాళ్వార్‌, 3.పేయాళ్వార్‌, 4.తిరుమళిశై ఆళ్వార్‌, 5.కులశేఖరాళ్వార్‌, 6.నమ్మాళ్వార్‌, 7.పెరియాళ్వార్‌, 8.ఆండాల్‌(గోదాదేవి), 9.తిరుప్పాణ్‌ ఆళ్వార్‌, 10.తిరుమంగై ఆళ్వార్‌. కాగా, మధురకవి ఆళ్వార్‌, తొండరడిప్పొడి ఆళ్వార్‌ శ్రీవారిపై పాశురాలు రచించలేదు.

 

ఈ ఆళ్వార్లలో ఏ ఒక్కరూ తిరుమల కొండపై అడుగుపెట్టలేదు. శ్రీవారు వెలసిన కొండ ఆదిశేషుని రూపమని, పాదం మోపరాదని వారి భావన. తిరుమల కొండకు నమస్కరిస్తే స్వామివారికి నమస్కరించినట్టేనని, పాపాలన్నీ తొలగిపోతాయని పాశురాల్లో తెలియజేశారు. ఆళ్వార్లు తమ దివ్యశక్తితో తిరుపతి నుంచే స్వామివారిని దర్శించారు.

 

 1. పొయ్‌కై ఆళ్వార్‌ (సరోయోగి) :

 

– పొయ్‌కై ఆళ్వార్‌ కాంచీనగరంలోని తిరువెక్కా అనే క్షేత్రంలో ఒక సరస్సులో బంగారు తామరపూవులో జన్మించారు.

 

– శ్రీమన్నారాయణుని ఆయుధాలలో ఒకటైన పాంచజన్యం(శంఖు) అంశతో ఆశ్వయుజమాసం శ్రవణా నక్షత్రంలో జన్మించారు.

 

– 100 పాశురాలు గల ముదల్‌ తిరువందాది అనే ప్రబంధాన్ని రచించారు.

 

 1. పూదత్తాళ్వార్‌ (భూతయోగి):

 

– పూదత్తాళ్వార్‌ తిరుక్కడల్‌ మల్లై(మహాబలిపురం) అనే క్షేత్రంలో సముద్రతీరంలో ఒక నల్ల కలువ పూవు నుండి ఆశ్వయుజమాసంలో ధనిష్ఠా నక్షత్రంలో జన్మించారు.

 

– స్వామివారి కౌమోదకి అనే గద అంశగా అవతరించారు.

 

– 100 పాశురాలు గల ఇరణ్డామ్‌ తిరువందాది అనే ప్రబంధాన్ని రచించారు.

 

 1. పేయాళ్వార్‌ (మహాయోగి):

 

– పేయాళ్వార్‌ ఇప్పటి మద్రాస్‌(చెన్నై) నగరంలోని మైలాపూర్‌ ప్రాంతంలో గల ఒక బావిలో ఎర్ర తామరపూవులో ఆశ్వయుజ మాసం, శతభిష నక్షత్రంలో జన్మించారు.

 

– శ్రీవారి భగవంతుని ఖడ్గమైన నందకమనే అంశతో అవతరించారు.

 

– 100 పాశురాలు గల మూన్రామ్‌ తిరునందాది అనే ప్రబంధాన్ని రచించారు.

 

 1. తిరుమళిశై ఆళ్వార్‌ (భక్తిసారయోగి):

 

– తిరుమళిశై ఆళ్వార్‌ చెన్నై నగరానికి సమీపంలో గల తిరుమళిశై అనే క్షేత్రంలో భార్గవ మహర్షికి కుమారుడుగా అవతరించారు.

 

– భగవానుని చక్రాయుధం అంశతో వీరు పుష్యమాసం (మకరమాసం) మాఘా నక్షత్రంలో జన్మించారు.

 

– 96 పాశురాలు కల నాన్ముకన్‌ తిరువందాది అనే ప్రబంధాన్ని, 120 పాశురాలు గల తిరుచ్చంద విరుత్తమ్‌ అనే ప్రబంధాన్ని రచించారు.

 

 1. కులశేఖరాళ్వార్‌ (కులశేఖరసూరి):

 

– కులశేఖరాళ్వార్లు క్షత్రియ కులంలో జన్మించారు.

 

– కేరళ రాష్ట్రంలోని కొల్లినగర్‌ అనే నగరంలో మాఘమాసంలో పునర్వసు నక్షత్రంలో భగవంతుని వక్షఃస్థలాన్ని అలంకరించే కౌస్తుభమనే రత్నం యొక్క అంశతో జన్మించారు.

 

– శ్రీరామచంద్రుని పట్ల గొప్ప భక్తి కలవారు కావున కులశేఖరప్పెరుమాళ్‌ అనే పేరుతో ప్రసిద్ధులు.

 

– పెరుమాళ్‌ తిరుమొళి అనే దివ్యప్రబంధాన్ని, ముకుందమాల అనే సంస్కృత స్తోత్రాన్ని రచించారు.

 

 1. నమ్మాళ్వార్‌ (శఠకోపసూరి):

 

– అళ్వార్లందరిలో నమ్మాళ్వార్‌ ప్రధానమైనవారు.

 

– తమిళనాడులోని ఆళ్వార్‌ తిరునగరి అనే క్షేత్రంలో వైశాఖ నక్షత్రంలో విష్వక్సేనుల అంశతో జన్మించారు.

 

– తిరువిరుత్తం, తిరువాశిరియమ్‌, పెరియ తిరువందాది, తిరువాయ్‌మొళి అనే నాలుగు ప్రబంధాలను రచించారు.

 

– ఈ ప్రబంధాలు ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణవేదం, సామవేదాలసారంగా ప్రసిద్ధి చెందాయి.

 

 1. పెరియాళ్వార్‌ (విష్ణుచిత్తులు):

 

– తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ క్షేత్రంలో శ్రీమన్నారాయణుని వాహనమైన గరుడుని అంశతో జ్యేష్ఠ మాసం, స్వాతి నక్షత్రంలో జన్మించారు.

 

– పాండ్యరాజ సభలో వాదించి విష్ణువే పరతత్త్వమనే సిద్ధాంతాన్ని నిరూపించారు.

 

– మంగళాశాసన ప్రబంధమైన తిరుప్పల్లాండ్లు, పెరియాళ్వార్‌ తిరుమొళి అనే ప్రబంధాలను రచించారు.

 

– ఇందులో శ్రీకృష్ణుని బాల్యలీలలను విశేషంగా వర్ణించారు.

 

 1. ఆండాళ్‌ (గోదాదేవి) :

 

– గోదాదేవి భూదేవి అంశతో ఆషాఢ మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో పాండ్య దేశంలోని(తమిళనాడు రాష్ట్రం) శ్రీవిల్లిపుత్తూర్‌లో తులసివనంలో జన్మించారు.

 

– ఈమెను పెరియాళ్వార్లు కుమార్తెగా అభిమానించి పెంచారు.

 

– శ్రీకృష్ణుని భర్తగా పొందడం కోసం మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రత క్రమాన్ని తిరుప్పావై ప్రబంధంగా లోకానికి అందించారు.

 

– 143 పాశురాలు గల నాచ్చియార్‌ తిరుమొళి ప్రబంధాన్ని కూడా రచించారు.

 

 1. తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ ( ప్రాణయోగి) :

 

– తిరుప్పాణ్‌ ఆళ్వార్లు కార్తీక మాసంలోని రోహిణి నక్షత్రంలో నిచుళాపురి (ఉఱైయాఠ్‌) అనే గ్రామంలో శ్రీవత్సమనే శ్రీమన్నారాయణుని పుట్టుమచ్చ అంశతో జన్మించారు.

 

– ఈయనకు మునివాహనసూరి అని కూడా పేరు.

 

– అమలనాదిపిరాన్‌ అనే పది పాశురాలు కల ప్రబంధాన్ని శ్రీరంగనాథుని దివ్యరూపాన్ని కీర్తించారు.

 

 1. తిరుమంగై ఆళ్వార్‌ :

 

– తిరుమంగై ఆళ్వార్‌ కార్తీకమాసంలోని కృత్తికా నక్షత్రంలో తిరువాలి తిరునగరి అనే క్షేత్రంలో శ్రీమన్నారాయణుని శార్‌ఙ్గమనే దనుస్సు అంశతో జన్మించారు.

 

– ఈయన పెరియ తిరుమొళి, తిరుక్కుఱున్దాణ్దకమ్‌, తిరువెళుకూత్తిరుక్కై, తిరునెడున్దాణ్డకమ్‌ అనే దివ్యప్రబంధాలను పాడారు.

 

– ఇవి ద్రవిడ వేదాంగాలుగా ప్రసిద్ధి చెందాయి.

 

 1. మధురకవి ఆళ్వార్‌:

 

– మధురకవి ఆళ్వార్లు నమ్వాళ్వార్లకు సమకాలికులు, శిష్యులు.

 

– వీరు చైత్రమాసంలో చిత్రానక్షత్రంలో, నిత్యసూరులో ఒకరైన గణాధిపుని అంశతో అవతరించారు.

 

– నమ్మాళ్వార్లనే దైవంగా కొలిచారు.

 

– నమ్మాళ్వార్లను కీర్తిస్తూ వీరు రచించిన 11 పాశురాలను కల కణ్ణినుణ్‌ శిఱుత్తామ్బు అనే ప్రబంధం ఆచార్యుడే పరదైవమనే నిష్టను తెలుపుతోంది.

 

 1. తొణ్డరడిప్పొడి ఆళ్వార్‌(భక్తాంఘ్రిరేణువు) :

 

– తొణ్డరడిప్పొడి ఆళ్వార్‌ మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠానక్షత్రంలో చోళదేశంలని ”మండంగుడి” అనే క్షేత్రంలో శ్రీమహావిష్ణువు ధరించే వనమాల అనే పూమాలిక అంశతో జన్మించారు.

 

– వీరికి విప్రనారాయణులని కూడా పేరు.

 

– శ్రీరంగనాథుని తప్ప వేరొకరిని ఎవ్వరినీ కీర్తించని ప్రత్యేకత వీరిది.

 

– 11 పాశురాలు గల తిరుప్పళ్లి ఎళుచ్చి ప్రబంధాన్ని, 45 పాశురాలు గల తిరుమాలై ప్రబంధాన్ని వీరు రచించారు.

.

Image result for alwar names